బూర్గంపహాడ్, మార్చి 20 : రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు మొండిచేయి మిగిలిందని బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు మహంకాళి రామారావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై శుక్రవారం ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్లో బీసీ సమాజ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నప్పటికీ సగం అంటే రూ.12 వేల కోట్లు మాత్రమే కేటాయించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా తెలంగాణ సామాజిక న్యాయం సాధ్యం కాదని తెలిపారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరం అని, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో బీసీలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక మద్దతు అవసరం అన్నారు.
బీసీ యువతలో నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్నాయని, స్వయం ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో బీసీ కార్పోరేషన్ రుణాలు మరింత విస్తరించాలన్నారు. సబ్సిడీ రుణాలు, స్టార్టప్ ప్రోత్సాహకాలు, బీసీ స్వయం ఉపాధి అవకాశాలు అమలు చేయాల్సి ఉందన్నారు. అవేమి ఈ బడ్జెట్లో పాటించలేదన్నారు. మరోపక్క పంచాయతీలకు కేటాయించిన నిధులు అంతంత మాత్రమేనన్నారు. ప్రతి పంచాయతీలో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ సరైన కేటాయింపులు లేకపోవడంతో పంచాయతీలు అభివృద్ధికి
దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. నిధులు పెంచి పంచాయతీలకు కేటాయిస్తే రాష్ట్రంలో పంచాయతీలు అభివృద్ధిపథంలో
నడుస్తాయని, లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పేర్కొన్నారు.