చుంచుపల్లి, ఏప్రిల్ 17 : రహదారి ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ ప్రాణ రక్షణ చర్యలు అందించాలనే లక్ష్యంతో కొత్తగూడెం రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అరైవ్-అలైవ్ రహదారి భద్రత వారోత్సవాలు స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎం & హెచ్ఓ తుకారం రాథోడ్(జిల్లా వైద్య ఆరోగ్య అధికారి) వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు “గోల్డెన్ అవర్” ప్రాముఖ్యతను వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంట ఎంతో కీలకమని, ఆ సమయంలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆలస్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు తెలిపారు.
అదేవిధంగా గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలో వైద్యాధికారులు ప్రాక్టికల్‌గా చూపించి డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రమాద స్థలంలో ఉన్న వారు భయపడకుండా ముందుకు వచ్చి సహాయం చేయాలని, ప్రభుత్వం కూడా గుడ్ సమారిటన్ విధానంతో సహాయం చేసే వారికి రక్షణ కల్పిస్తుందని వివరించారు. కారు, ఆటో డ్రైవర్లకు రహదారి నియమాలు పాటించడం, వేగ నియంత్రణ, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం వంటి భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని హెచ్చరించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా డ్రైవర్లలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించి ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుభాషిని, ఎంవీఐ నిర్మల, మనోహర్, శ్వేత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గోల్డెన్ అవర్, సీపీఆర్‌పై అవగాహన