చుంచుపల్లి, జనవరి 19 : టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా సోమవారం జూలూరుపాడు టీబీ యూనిట్ పెనగడప పీహెచ్సీ పరిధిలో గౌతపూర్, సేవింగ్ ప్లేయిన్ గ్రామస్తులకు డాక్టర్ నేహా అమ్రిన్ అధ్యక్షతన టీబీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి లక్షణాలు, రెండు వారాల నుండి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం బరువు తగ్గడం, రాత్రిళ్లు చెమటలు పట్టడం, దగ్గినప్పుడు తెమడలో రక్తం పడటం వంటివి ఉన్నట్లయితే దగ్గరలోని హాస్పిటల్కు వెళ్లి తెమడ పరీక్ష, ఎక్స్రే పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారని డాక్టర్ తెలిపారు. టీబీ నిర్ధారణ అయితే ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అన్నారు.
క్షయ వ్యాధిగ్రస్తుడు మందులు వాడుతున్నంత కాలం నెల నెలా రూ.1000 పోషణ భత్యం నిక్షయ పోషణ యోజన పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి అనుమానితుల వద్ద నుండి తెమడ శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్, ఎంఎల్హెచ్పీ, హెచ్వీ, ఏఎన్ఎంలు, ఆశాలు, టీబీ అలర్ట్ ఇండియా ఎక్స్రే నిపుణులు, జిల్లా కోఆర్డినేటర్ పాల్గొన్నారు.