రామవరం, మే 01 : కార్మికులు తన చెమట చుక్కలను చిందించి వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే రోజే కార్మిక దినోత్సవం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ అన్నారు. గురువారం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్ హాల్, మార్కెట్ ఏరియా కొత్తగూడెంలో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అసంఘటితరంగ కార్మికులకు కార్మిక చట్టాలపైన అవగాహన అవసరమని తెలిపారు. దేశం బాగుపడాలంటే కార్మికుల శ్రమే కీలకం అన్నారు.
చిన్నారులను పనిలో పెట్టుకోవద్దన్నారు. ప్రతి కార్మికుడు ఇ- శ్రమ్ కార్డు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. కార్మికుల మధ్య లింగ వివక్ష లేదని పని ప్రదేశాల్లో అందరికీ సమాన హక్కులు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, బిల్డింగ్ వర్కర్స్ అధ్యక్షుడు గాజుల రామచందర్, గౌరవ అధ్యక్షుడు గోవింద చారి, ప్రధాన కార్యదర్శి బండ్ల కృష్ణ, కోశాధికారి దేవినేని వెంకటేశ్వర్లు, సలహాదారు టి.పుల్లయ్య పాల్గొన్నారు.