కరకగూడెం, మే23 : అతివేగం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వీరాపురం గ్రామానికి చెందిన పోలెబోయిన రాంబాబు(40) మరణించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన పోలెబోయిన రాంబాబు(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం స్వగ్రామం నుండి ఆటో నడుపుతూ అతడు కరకగూడెం వైపు వస్తుండగా భట్టుపల్లి గ్రామం వద్ద ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని గమనించిన స్థానికులు వెంటనే మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా రాంబాబు మరణించాడు. మృతుడు బావమరిది వజ్జా రామనాథం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.