కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 05 : ఆపరేషన్ కగార్ పేరిట మధ్యభారతంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులు, బూటకపు ఎన్కౌంటర్లను రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఆలోచనపరులు ఖండించేందుకు ముందుకు రావాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ప్రజా ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు.
శనివారం కొత్తగూడెంలోని స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయం నందు జరిగిన పోస్టర్ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. అడవిని, అడవిలోని సహజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న ఆదివాసీల వీరోచిత పోరాటంపై ప్రభుత్వాలు క్రూర మరణకాండను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆదివాసీలను హతమార్చుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలను నక్సలైట్లు అంటూ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని ఆరోపించారు. ఆదివాసి ప్రజల గురించి మాట్లాడిన వారిపై అర్బన్ నక్సలైట్ల పేరుతో ఊపా కేసులు, పీడీ కేసులు, రాజద్రోహం కేసులు ప్రయోగిస్తుందని తెలిపారు.
ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నట్లు దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకుల అణిచివేతని, బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఈ నెల 8న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.సంజీవ్, కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావు, నాయకులు వి.సురేశ్, నరేశ్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి ప్రణయ్, నాయకులు కిరణ్, సిద్ధూ పాల్గొన్నారు.