కారేపల్లి, ఆగస్టు 19 : ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కారేపల్లి పీహెచ్సీ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల వైద్యాధికారి డాక్టర్ బీ.సురేశ్‌కు అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ మండల కన్వీనర్ కె.నరేంద్ర, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు ఎల్లబోయిన రాధ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచుతామని ప్రకటనలు చేయటం తప్ప అమలుకు నోచడం లేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన సమ్మెలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆశా వర్కర్స్ డిమాండ్లు న్యాయమైనవని, అధికారంలోకి వస్తే సమ్మె కాలంలో డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రకటించి రెండేండ్లు అవుతున్నా ఆశాల డిమాండ్లు అమలు చేయకపోగా, అడగడానికి వెళ్తున్న ఆశాలపై నిర్భంధాలు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాలపై పని భారం తగ్గించడం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించటం, ఉద్యోగ భద్రతపై హామీ ఇవ్వాలన్నారు. లేకుంటే భవిష్యత్‌లో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వాంకుడోత్ కమల, జంగా కళ్యాణి, సరస్వతి, కుమారి, ఈసాల ఈశ్వరి, పద్మ, బుజ్జమ్మ, దేవి, లక్ష్మీ, రేణుక పాల్గొన్నారు.