రామవరం, ఏప్రిల్ 09 : రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పనివేళలు మార్చాలంటూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పారిశుధ్య కార్మికులు జనరల్ మేనేజర్ సివిల్ టి.సూర్యానారాయణకు విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. సింగరేణి వ్యాప్తంగా హౌస్ కీపింగ్, పారిశుధ్య కార్మికులు సుమారు 3 వేల మంది ఉంటారని, ఇప్పటికే మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, ఇల్లందు ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి నుండి వచ్చిన అభ్యర్థన మేరకు నేటి (బుధవారం) నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే విధుల నిర్వహణ ఉంటుందని వెల్లడించారు.
కాగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సివిల్ జనరల్ మేనేజర్ ఆదేశాలు బేకాతర్ చేస్తున్నారా? లేక సమన్వయ లోపం వల్ల పొరపాటు జరిగిందా? తమని కాదని పై అధికారుల వద్దకు వెళ్లి పని చేయించుకుంటారా అనే అక్కసా? ఏమో తెలియదు కానీ రోజంతా విధులు నిర్వర్తించాల్సిందేనని ఏజీఎం పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. దీంతో కూత వేటు దూరంలో ఉన్న కార్పొరేట్లో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహించేలా అనుమతించారని, తమకెందుకు అనుమతి తెలుపరని పారిశుద్ధ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశుధ్య కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.