కారేపల్లి, మే 17 : ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తన్నీరు నాగేశ్వరరావు శనివారం తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 8 ఏకలవ్య స్కూళ్లలో 302 ఖాళీలను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. సింగరేణి ఏకలవ్య కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఎంపీసీలో బాలికల విభాగంలో 4, బైపీసీలో బాలుర విభాగంలో 5, సీఈసీ గ్రూపులో బాలురు 9 సీట్లు, బాలికలకు 15 సీట్లు మొత్తం 33 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
ఖాళీ సీట్లకు ఈ నెల 24వ తేది వరకు అన్ని ఏకలవ్య స్కూళ్లలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అన్ని సీట్లు ఎస్టీ అభ్యర్దులతో నింపడం జరుగుతుందన్నారు. ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుందని, కౌన్సిలింగ్ ను ఈ నెల 26వ తేదిన చర్ల ఏకలవ్య స్కూల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల ఎస్టీ విద్యార్ధులు జన్మ ధ్రువీకరణ, టీసీ, ఎస్ఎస్సీ మోమో, స్టడీ కండక్ట్, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు జీరాక్స్లతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.