రామవరం, జూలై 15 : మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండు, రైల్వే స్టేషన్లో పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. కాగా అవి ఇప్పుడు తాజాగా గుత్తి కోయ గుడాల్లో వెలసి చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం కొత్తగూడెం 2టౌన్ పరిధిలోని గుత్తి కోయ గ్రామాలైన పాలేవాగు, జగ్గారాం, గడ్డిగుప్ప, మర్రిగూడెం గ్రామ శివారుల్లో ఉదయం మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ కరపత్రాలు వెలిశాయి. సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా, అక్కల్లారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఆశాకిరణం ఎన్నడైంది. మీకు ఎదురైన సవాళ్లు, తద్వారా వచ్చే పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మ సంతృప్తిని మిగిల్చిందేంది. ఆత్మ సంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న మీ 40 ఏండ్లనాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మోడుబారిన బీడు భూమిలాగా అయ్యింది.
మావోయిస్టు అగ్ర నాయకుల్లారా, ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి, కాలానుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో పాత్రులు కండి. అడవిని వీడి ప్రజల్లోకి రండి – ప్రజాస్వామ్య గొంతుక కండి. ఆయుధాలు మనకొద్దు – ప్రజామోద మార్గమే మనకు ముద్దు. ఆయుధాలు వీడండి- జనజీవన స్రవంతిలోకి రండి. మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి. ఈ విధంగా కరపత్రంలో ముద్రించి ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కరపత్రాలపై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే బస్టాండు, రైల్వేస్టేషన్లో అంటించారంటే ఎవరో పోలీసు సానుభూతిపరులే ఈ పని చేసి ఉంటారని, మావోయిస్టులను జనజీవన స్రవంతిలో తీసుకుని వచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు.