రామవరం, జనవరి 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీసుల మానవత్వం మరోసారి వెలుగు చూసింది. ఇటీవల జూలూరుపాడు పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని సుమారు 75 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహాన్ని జూలూరుపాడు పోలీసులు కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించి భద్రపరిచారు. నాలుగు రోజులు గడిచినా ఆ వృద్ధురాలి కోసం ఎవరూ రాకపోవడంతో ఆమెను అనాథ మృతదేహంగా భావించిన పోలీసులు మానవతా దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జూలూరుపాడు ఎస్ఐ రవికుమార్ ఖమ్మంకు చెందిన అన్నం ఫౌండేషన్ కి సమాచారం అందించగా, శుక్రవారం ఆ సంస్థ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంబులెన్స్ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది.
జూలూరుపాడు పోలీసులు, మార్చురీ సిబ్బంది సమక్షంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కొత్తగూడెం పట్టణంలోని హిందూ స్మశానవాటికలో పూర్తి గౌరవంతో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ సభ్యులతో పాటు, కొత్తగూడెం, రామవరానికి చెందిన రామవరం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, స్మశాన వాటిక కాటికాపరి సత్యనారాయణ పాల్గొన్నారు.