భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26. (నమస్తేతెలంగాణ) : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అంగన్వాడీ ప్రాజెక్టు కూలీలైన్ సెక్టార్ అంగన్వాడీ టీచర్ జే ప్రసన్న లక్ష్మి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో సోమవారం కన్నులపండువగా జరిగిన రిపబ్లిక్ డే సంబురాలను ఆమె ప్రత్యక్షంగా వీక్షించారు. రెండు రోజులు క్రితం అధికారులు ప్రసన్న లక్ష్మిని హైదరాబాద్ పిలిచి.. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ప్రత్యేక వసతి కల్పించి గణతంత్ర వేడుకలను తిలకించే అవకాశం కల్పించారు.
అంగన్వాడీ టీచర్‌గా జే.ప్రసన్న లక్ష్మి విశేష సేవలందించారు. సొంత ఖర్చులతో పిల్లలకు ఆహ్లాదంగా ఉండే వాతావరణాన్ని కల్పించి పేరు తెచ్చుకున్నారు. ఆమె కృషికి ప్రోత్సాహకంగా రెండు సార్లు ఉత్తమ టీచర్‌గా అవార్డులతో ప్రభుత్వం సత్కరించింది. చిన్న ఉద్యోగమైనా బాధ్యతగా పని చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రసన్న లక్ష్మికి ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఆహ్వానం వచ్చింది. ఈ మహత్తర అవకాశం రావడంతో.. ఆమెను అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లారు. రిపబ్లిక్ డే వేడుకలను తిలకించిన తర్వాత ప్రసన్న లక్ష్మికి కేంద్ర మంత్రి ప్రత్యేక షీల్డ్‌ను బహూకరించారు.