కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ సమాజంలో సగభాగానికి పైగా ఉన్న బీసీలను మిగతా ఎస్టీ, మైనారిటీలను ప్రభుత్వం భాగస్వామ్యం చేయకపోవడం అత్యంత బాధాకరమని రాజ్యాంగ రక్షణ వేదిక కన్వీనర్ మల్లెల రామనాధం బుధవారం ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. అంబేద్కర్ అందరికీ మహానీయుడని, అటువంటి మహనీయుడి జయంతిని కేవలం ఎస్సీ వర్గం వారితో కమిటీని నియమించడం, ఆహ్వానితుల్లో గానీ, వేదికపై గానీ బీసీ, ఎస్టీ, మైనార్టీలను ఆహ్వానించకపోవడం బాధాకరమన్నారు.
ఎస్టీ, బీసీలకు అవక్షం కల్పించకపోవడం ఐక్యతకు ఆటంకమన్నారు. ప్రపంచ స్థాయి మహనీయుడిని ఒక ఎస్సీలకే పరిమితం చేయడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించడమేనన్నారు. ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలన్న అంబేద్కర్ కలలు నిజం కావాలంటే అన్ని వర్గాలు చైతన్యంతో ఐక్యం కావడమే పరిష్కారం అన్నారు. అంబేద్కర్ వాస్తవ కమిటీ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం విచారకరమన్నారు. భవిష్యత్‌లోనైనా ఈ అనైక్యతను అధిగమించాలని ఆయన కోరారు.