రుద్రంపూర్, మే 08 : 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా “వాయిస్ ఆఫ్ నేషన్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో 3కే వాక్‌థాన్ నిర్వహించారు. ఈ వాక్‌థాన్‌ను జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి. భరత్ జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగూడెం రేడియో స్టేషన్ నుండి ప్రారంభమైన వాక్‌థాన్ 14 నంబర్ ఏరియా, రామవరం సెంటర్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తిరిగి రేడియో స్టేషన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా స్టేషన్ ప్రోగ్రాం హెడ్ కొలిపాక శంకరరావు మాట్లాడుతూ.. 1936లో ప్రారంభమైన ఆకాశవాణి నేటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు.
దక్కన్ రేడియోగా ప్రారంభమైన ఈ ప్రసార సంస్థ కాలక్రమేణా ఆకాశవాణిగా రూపాంతరం చెంది దేశ ప్రజలకు విశ్వసనీయ సమాచార వేదికగా నిలిచిందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధునిక మాధ్యమాలు అందుబాటులో లేని కాలంలో ప్రజలకు సమాచారం, వినోదం, వ్యవసాయ సూచనలు అందిస్తూ ఆకాశవాణి ప్రజావాణిగా ఎదిగిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, పండితులు, సామాన్యులను అలరిస్తూ నేటికీ మారుమూల గ్రామాల్లో కూడా తన ప్రసారాలతో ప్రత్యేక గుర్తింపు నిలుపుకుందన్నారు.
“బహుజన హితాయ.. బహుజన సుఖాయ” అనే నినాదంతో పనిచేస్తున్న ఆకాశవాణి ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు, విపత్తుల సమయంలో ప్రజలకు సమయానుకూల సమాచారం అందించి అనేక ప్రాణాలను కాపాడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే 90 వసంతాల సందర్భంగా కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వాక్‌థాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్, రామవరం పశువైద్యులు డాక్టర్ ఆనంద్, పర్యావరణ ప్రేమికుడు నూర్వి రాజశేఖర్, స్టేషన్ సిబ్బంది, రేడియో వ్యాఖ్యాతలు పాల్గొన్నారు.

“ప్రజావాణి”కి 90 వసంతాలు.. కొత్తగూడెంలో ఆకాశవాణి 3కే వాక్‌థాన్