– పీవీకే-5 పిట్ కమిటీ
రుద్రంపూర్, జూన్ 16 : అండర్‌గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా మార్చే విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ యూనియన్ మాత్రమేనని పీవీకే-5 గని పిట్ కమిటీ పేర్కొంది. మంగళవారం పీవీకే-5 గనిలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఇతర సంఘాలు మానుకోవాలని కోరారు. ఇటీవల పీవీకే-5 గనిలో జరిగిన ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్‌లో ఏఐటీయూసీపై చేసిన విమర్శలను వారు ఖండించారు. ఐఎన్టీయూసీ నాయకులు చేపట్టబోయే పోరాటాలు యాజమాన్యంపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా లేక ఇతర కార్మిక సంఘాలపైనా అన్న విషయాన్ని కార్మికులకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డిపెండెంట్ వారసుల నియామకాల కోసం ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించిందని, ఈ విషయంలో ఐఎన్టీయూసీ పాత్ర ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు.
అలాగే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిల అంశంపై, అలాగే మెడికల్ బోర్డు నిలిపివేతపై ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఐఎన్టీయూసీ తన వైఖరిని వెల్లడించాలని కోరారు. పీవీకే-5 గనిలో సొంతింటి స్థలాల సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన హామీ అమలుపై కూడా ఐఎన్టీయూసీ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అంశంపై వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. మణుగూరులో సర్ఫేస్ పోస్టులు తమ వల్లే వచ్చాయని చెప్పుకుంటున్న ఐఎన్టీయూసీ నాయకులు, కొత్తగూడెం ప్రాంతంలో మాత్రం ఎందుకు సర్ఫేస్ పోస్టులు సాధించలేకపోతున్నారో కార్మికులకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఐఈడీ ప్రకారం కొత్తగూడెం భూగర్భ గని కార్మికులకు 270 సర్ఫేస్ పోస్టులు ఇప్పిస్తే, ఐఎన్టీయూసీ నిర్వహించే పాలాభిషేక కార్యక్రమంలో ఏఐటీయూసీ కండువాలతో పాల్గొంటామని ప్రకటించారు. ఇతర కార్మిక సంఘాలపై విమర్శలకు పరిమితం కాకుండా కార్మిక సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా పోరాటాలు నిర్వహించాలని ఐఎన్టీయూసీకి సూచించారు. ఈ సమావేశంలో పిట్ కార్యదర్శి, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్ సెత్, పిట్ ఉపాధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జ్ సాయి పవన్, సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్, సురేందర్ రెడ్డి, సంజీవ్, ప్రశాంత్, హరికృష్ణ, ఈర్ప కృష్ణ, సురేష్, రవీందర్, రాజేష్, కోటేశ్వరరావు, మహేష్, రామారావు, కార మోహన్, మదనయ్య, ముబారక్, మేకల శీను, మహేష్, సంతానం తదితరులు పాల్గొన్నారు.