– బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, ఆగస్టు 21 : రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నెం. 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్లొమా విద్యార్థుల విద్యా ప్రమాణాలను తగ్గించి, వారి బీటెక్ ఉన్నత విద్యావకాశాలను కాలరాసే కుట్రను సహించేది లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని గిరిబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ మెడలు వంచైనా న్యాయం సాధిస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ పాలనలో సాంకేతిక విద్యకు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశామని ఆయన గుర్తుచేశారు. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్కు అంతర్జాతీయ సంస్థలు తరలివచ్చి, వేలాది మంది యువతకు ఉపాధి లభించిందని తెలిపారు. కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆగస్టు 15 నాటికి రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ హామీని గాలికి వదిలేసి విద్యార్థులను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, జీవో నెం. 97ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల ఆగ్రహజ్వాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భస్మం కాక తప్పదని గిరిబాబు తీవ్రంగా హెచ్చరించారు.