Kalyan | తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026-28 ద్వైవార్షిక ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ సత్తా చాటింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. తుది ఫలితాల్లో మాత్రం ‘మన ప్యానెల్’ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం 1,168 మంది ఓటర్లకు గాను 643 మంది నిర్మాతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఏకగ్రీవంగా ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓట్ల లెక్కింపులోనూ ఆయనకు మద్దతుగా నిలిచిన ‘మన ప్యానెల్’ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు.
మండలిలోని కీలక పదవులకు జరిగిన ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ స్థానాల్లో ఒకదాన్ని ‘మన ప్యానెల్’కు చెందిన మోహన్ వడ్లపట్ల గెలుచుకోగా.. మరో స్థానాన్ని ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ అభ్యర్థి దామోదర్ ప్రసాద్ దక్కించుకున్నారు. ఇక ట్రెజరర్ పదవిలో చదలవాడ శ్రీనివాసరావు భారీ ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. రెండు జాయింట్ సెక్రటరీ స్థానాలనూ ‘మన ప్యానెల్’ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. అమ్మిరాజు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ జాయింట్ సెక్రటరీలుగా ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీలోని మొత్తం 15 స్థానాలకు జరిగిన పోటీలో ‘మన ప్యానెల్’ ఏకంగా 12 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ ప్యానెల్ నుంచి పద్మిని, ఏషియన్ సునీల్, మోహన్ గౌడ్, శివలెంక కృష్ణప్రసాద్, డీవీవీ దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, శ్రీనివాసరావు, పుల్లారావు, బాపిరాజు, ఆర్కే గౌడ్, నయీం విజయం సాధించారు.మరోవైపు ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ నుంచి మైత్రీ రవిశంకర్, నిరంజన్ రెడ్డి, డీఎస్ రావు ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికయ్యారు.దీంతో నిర్మాతల మండలిలో ‘మన ప్యానెల్’కు స్పష్టమైన ఆధిక్యం లభించినట్లయింది. అయితే ప్రధాన కార్యదర్శి పదవికి సంబంధించిన ఫలితం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫలితాన్ని ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్ సీల్డ్ కవర్లో న్యాయమూర్తికి సమర్పించనున్నారు. ఈ అంశంపై ఈ నెల 8న కోర్టు సమక్షంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రధాన కార్యదర్శి పదవికి సంబంధించిన తుది నిర్ణయంపై కూడా నిర్మాతల్లో ఆసక్తి నెలకొంది.