Hyderabad |పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి అత్యవసర వైద్యం అందించకుండా వెనక్కి పంపించేశారు. దీంతో వేరే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవించింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధిత కుటుంబం కథనం ప్రకారం.. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఆదివారం వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అత్యవసర సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు.. రిపోర్టులు లేవనే కారణంతో మహిళకు ప్రసవం చేసేందుకు నిరాకరించారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఎంత బతిమిలాడినా ఆస్పత్రి సిబ్బంది వినిపించుకోకపోవడంతో.. వేరే దారిలేక అంబులెన్స్‌లో మరో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మహిళ పరిస్థితి విషమించింది. మార్గమధ్యలో అంబులెన్స్‌లోనే ప్రసవించింది.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలోనూ వైద్యం అందించకుండా వెనక్కి పంపడమేంటని వారు మండిపడుతున్నారు. గర్భిణీకి లేదా శిశువుకు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.