Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో తనదైన ఆటతీరు, ముక్కుసూటితనం, పంచ్ డైలాగులతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శివాజీ మరోసారి సరికొత్త అవతారంలో సందడి చేయబోతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా తనదైన ముద్ర వేసిన ఆయన.. గత సీజన్లో ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల నుంచి ఆసక్తికర విషయాలను రాబట్టి ఆకట్టుకున్నారు. ఇప్పుడు సీజన్ 10 కోసం కూడా ఆయనే బజ్ హోస్ట్‌గా కొనసాగనుండటం ఆసక్తిని పెంచుతోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బయటకు వచ్చిన వెంటనే ఇంటర్వ్యూ చేసే ప్రత్యేక కార్యక్రమమే బిగ్ బాస్ బజ్. సాధారణ ఇంటర్వ్యూలకు భిన్నంగా.. హౌస్‌లో జరిగిన విషయాలు, కంటెస్టెంట్ల గేమ్ స్ట్రాటజీలు, వివాదాలు, తప్పులు వంటి అంశాలపై నేరుగా ప్రశ్నలు సంధించడం ఈ షో ప్రత్యేకత.
సీజన్ 10 కోసం విడుదల చేసిన తాజా ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. “ఇది ఆట కాదు.. వేట!” అంటూ శివాజీ కనిపించడం షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హాట్ సీట్లో కూర్చున్న ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను ఏమాత్రం తగ్గకుండా ప్రశ్నిస్తూ.. వారి గేమ్‌లోని అసలు విషయాలను బయటకు తీసేందుకు శివాజీ సిద్ధమైనట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. బిగ్ బాస్ జర్నీలో జరిగిన విషయాలను గుర్తుచేస్తూ.. నిజానిజాలను తూకం వేసే వ్యక్తిగా శివాజీ కనిపించడంతో ఈసారి బజ్ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ మారిన ప్రతిసారీ బజ్ హోస్ట్ కూడా మారుతూ వస్తున్నారు. గత సీజన్లలో బిగ్ బాస్‌లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కంటెస్టెంట్లకు తదుపరి సీజన్ బజ్ హోస్ట్‌గా అవకాశం కల్పించారు.
అయితే శివాజీ విషయంలో మాత్రం ఈ ట్రెండ్ కాస్త భిన్నంగా కనిపిస్తోంది. గత సీజన్లో బజ్‌ను తనదైన స్టైల్లో నడిపించిన ఆయనకు ఇప్పుడు మరోసారి అదే బాధ్యత అప్పగించారు. దీంతో వరుసగా బిగ్ బాస్ బజ్కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కంటెస్టెంట్‌గా శివాజీ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా హౌస్‌లో ఉన్నప్పుడు చెప్పలేని విషయాలను ఎలిమినేషన్ తర్వాత కంటెస్టెంట్లు వెల్లడిస్తారా? ఎవరి గేమ్ ఎలా ఉంది? ఎక్కడ తప్పు చేశారు? ఎవరితో గొడవలు జరిగాయి? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి సమయంలో శివాజీ హోస్టింగ్‌కు ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.