రామవరం, ఏప్రిల్ 10 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పద్మావతిఖని (పీవీకే 5 ఇంక్లైన్) లో కంటిన్యూస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు సింగరేణి యాజమాన్యం గ్యాన్వెల్ ద్వారా ఒప్పందం చేసుకుంది. బొగ్గును తీస్తున్న క్రమంలో బుధవారం నైట్ షిఫ్ట్ లో భాగంగా కాంట్రాక్ట్ కార్మికుడు జయపాల్ బకెట్ పంప్‌కు ఓస్ కలుపుకున్న సమయంలో తలపై బొగ్గు పెళ్ల పడడంతో తీవ్రగాయమైంది. విషయం బయటికి సోకుండా ఉండేందుకు గ్యాన్వెల్ కంపెనీ ప్రతినిధులు అతడిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కావడంతో నాలుగు కుట్లు పడినట్లు సమాచారం. బాధితుడిని ఎవరితోనూ మాట్లాడకుండా కంపెనీ ప్రతినిధులు పద్మావతి ఖని గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్ 8లో ఉంచారు.
గత నెలలో కూడా మదన్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు నలుగురు కలిసి ఎత్తాల్సిన బకెట్ పంపును ఇద్దరు కార్మికులు లేపి పక్కన పెడుతున్న క్రమంలో అదుపుతప్పి అతని కాళ్లపై పడి తీవ్ర గాయం కావడంతో అతనికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. శక్తికి మించి భారం వేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు అంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని పనులు నుండి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆగడాలను తట్టుకోలేక కాంట్రాక్ట్ కార్మికుడు జిల్లా కలెక్టర్ ను కలిసి గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు సైతం చేశాడు. ఈ విషయమై ఏరియా సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు రావును వివరణ కోరగా తాను మాన్సూన్ ఆడిట్లో భాగంగా మణుగూరులో ఉన్నానని, విషయంపైన దర్యాప్తు చేస్తానని తెలిపారు.