Burgampahad | బూర్గంపహాడ్, జూన్ 21: బూర్గంపహాడ్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి చేపను ఏసీబీ అధికారులు వలవేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.టైపిస్ట్ రూ.2500 లంచం తీసుకుంటూ అధికారులకు శనివారం చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ఇటీవల రేషన్‌కార్డుల ప్రక్రియ చేపట్టడంతో రెవెన్యూ కార్యాలయంలో రేషన్‌కార్డుల దరఖాస్తులను ప్రాసెస్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మండలానికి చెందిన ఓ వ్యక్తి రేషన్‌కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ చేయాలని చెప్పడంతో రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ (టైపిస్ట్)గా పనిచేస్తున్న సీహెచ్ నవక్రాంత్ రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రూ.2500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ తన బృందంతో కలిసి టైపిస్ట్‌ను పట్టుకున్నాడు.
తహశీల్దార్ కార్యాలయంలో ఏడాది కిందట టైపిస్ట్‌గా విధుల్లో చేరిన నవక్రాంత్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఏ పని కావాలన్నా డబ్బులు వసూలు డిమాండ్ చేస్తాడని తహశీల్దార్ కార్యాలయం వద్దకు పని కోసం వచ్చిన వారంతా చెబుతారని పలువురు పేర్కొంటున్నారు. ఏడాది క్రితం ఓ రైతుకు సంబంధించిన పాస్‌బుక్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. సబ్ కలెక్టర్ ఆఫీసు వెళితే తిరిగి వచ్చింది. పహాణీ యాడ్ చేసి పంపాలి అని చెప్పి రైతును కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నాడు. ఇప్పటివరకు కూడా ఆ ఫైల్ తహశీల్దార్, డీజీకి చేరలేదని ఆ రైతు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికీ ఆ ఆ రైతు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అంతే కాకుండా టైపిస్ట్ కార్యాలయానికి వచ్చే వారితో అమర్యాదగా మాట్లాడుతూ అన్నీ తానై అనేలా వ్యవహరించేవాడని ఆరోపణలున్నాయి.
బూర్గంపహాడ్ తహశీల్దార్ కార్యాలయంలో గత పదకొండేళ్లలో ఇప్పటికి మూడుసార్లు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 2014, 2018 సంవత్సరాల్లో దాడులు చేయగా అప్పట్లో ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. 2014లో అప్పటి ఇన్చార్జి తహశీల్దార్ సుంకర శ్రీనివాస్, టైపిస్ట్‌గా పని చేసిన దినేశ్ నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు భూమికి ఆన్లైన్ చేసేందుకు సరైన డాక్యుమెంట్లు లేవంటూ లంచం డిమాండ్ చేశారు. ఆ సమయంలో రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండా.. అప్పటి ఏసీబీ డీఎస్పీ సాయిబాబా బృందం పట్టుకొని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత 2018లో డీటీగా పని చేస్తున్న భరణిబాబు సారపాక భాస్కర్‌నగర్ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ఇసుక సరఫరా అనుమతులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసీ ఏసీబీకి పట్టుబడ్డాడు. తాజాగా టైపిస్ట్ ఏసీబీకి చిక్కాడు.
ప్రభుత్వ శాఖలో ఏ అధికారి అయినా చేసిన పనికి లంచం అడిగితే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ సూచించారు. ప్రతిశాఖలో అధికారులు చట్టబద్ధంగా విధులు నిర్వర్తించాలని, అధికారులు ప్రజల నుంచి డబ్బులు లంచంగా అడిగితే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని.. సమాచారం ఇచ్చిన వెనువెంటనే లంచం తీసుకునే అధికారుల భరతం పడుతామని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని, లంచం తీసుకునే వారిపై చర్యలుంటాయన్నారు. ప్రజలకు ఏసీబీతో తప్పక న్యాయం జరుగుతుందన్నారు. ఏసీబీకి సమాచారం ఇవ్వాలంటే 1064 , 9154388981 నెంబరులో సమాచారం ఇవ్వాలని కోరారు.