భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 03 : ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తల్లి చూపెట్టే ప్రేమకు సాటిలేదంటారు. అలాంటి కన్న ప్రేమకు ఇదో ఉదాహరణ. చంటి బిడ్డ ఏడుపు చూడలేకపోయిన ఆ తల్లి ఆర్టీసీ బస్సులోనే ఊయల ఏర్పాటు చేసి ఆ పసిపాప హాయిగా నిద్రించేలా చేసింది. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భద్రాచలం నుండి ఖమ్మం వెళ్తుంది. అదే బస్సులో ఓ మహిళ తన చంటిబిడ్డతో ప్రయాణిస్తుంది. బస్సు ప్రయాణం చికాకు కలిగించిందోమో ఆ బిడ్డ ఏడుపు అందుకుంది. ఎన్ని రకాలుగా జోకొట్టి సముదాయించినా ఏడుపైతే ఆపడం లేదు. దీంతో ఆ తల్లి తన బ్యాగ్ నుండి ఓ చీర తీసి అప్పటికప్పుడు బస్సులోనే ఊయల ఏర్పాటు చేసింది. బస్ లగేజీ క్యారీయర్కు చీరతో ఊయల కట్టి ఆ పసి పాపను అందులో వేసి ఊపడం ప్రారంభించింది. దీంతో ఆ బిడ్డ ఒక్కసారిగా ఏడుపు బంద్ చేసి హాయిగా ఊగుతూ నిద్రకు ఉపక్రమించింది. చిన్నారి ఏడుపు బంద్ చేయడంతో బస్సులోని ప్రయాణికులందరి మనస్సులు తేలికపడి అంతా ఆ తల్లి బిడ్డ వైపే చూశారు.