చుంచుపల్లి, జూలై 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తాసీల్దార్ నాగరాజు తెలిపారు. మండలంలోని మొత్తం 39,547 మంది ఓటర్లలో 27,500 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, 70 శాతం మంది ఓటర్ల ఆన్లైన్ మ్యాపింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 41 మంది బీఎల్వోలు, నలుగురు సూపర్వైజర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 30 శాతం మంది ఓటర్లలో కొందరు ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, కొందరు మరణించడం, మరికొందరికి రెండు చోట్ల ఓటరుగా నమోదై ఉండడం వంటి కారణాలతో మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆయా ఓటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత బీఎల్వోల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ల వివరాల సాఫ్ట్ కాపీలను గ్రామ కార్యదర్శులు, బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లు, సంబంధిత సిబ్బందికి అందజేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీవోలు, మల్టీపర్పస్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు తప్పనిసరిగా బీఎల్వోలు, గ్రామ కార్యదర్శులకు సహకరించాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి గ్రామ పంచాయతీలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని, ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ సిబ్బంది, బీఎల్వోలు లేదా తాసీల్దార్ను సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారాలను సరిగ్గా నింపి సమర్పించాలని సూచించారు. ఈ నెల 22వ తేదీలోగా ప్రతి ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి తిరిగి అప్పగించాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.