
హర్షం వ్యక్తం చేస్తున్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు
కోలిండియా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమంటూ కితాబు
కంపెనీ వ్యాప్తంగా 43,898 మందికి లబ్ధి
కొత్తగూడెం ఆగస్టు 13 :సింగరేణి కార్మికులు, ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ తర్వాత ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి అవకాశం కల్పించింది. ఈ నెల 31వ తేదీలోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగ విరమణ వయస్సు పెంపుతో ఇప్పటికే రిటైర్డ్ అయిన 1,082 మంది ఉద్యోగులతో కలిపి మొత్తం 43,899 మందికి లబ్ధి చేకూరనున్నది. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఉత్తర్వులపై సింగరేణి ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
కోలిండియా చరిత్రలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరావు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన బోర్డాఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లుకు పెంచుతూ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయస్సు పెంపునకు సంబంధించిన విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను డైరెక్టర్ (పా) బలరాం విడుదల చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి 31వ తేదీ తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఉద్యోగి, అధికారి తిరిగి విధుల్లో చేరడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 31వ తేదీలోగా విధుల్లో చేరాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఉద్యోగాల్లో చేరని పక్షంలో తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉండదు. ఉద్యోగ విరమణ పొందిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే తేదీ మధ్య కాలాన్ని నో వర్క్- నో పేగా పరిగణిస్తారు. కానీ ఆ కాలాన్ని కంపెనీ సర్వీసుగానే గుర్తించనున్నది. పదవీ విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే వారి పింఛన్‌ను నిలుపుదల చేసేలా సీఎంపీఎఫ్ అధికారులను సింగరేణి కోరనున్నది.
సింగరేణి కుటుంబాల హర్షం..
సీఎం కేసీఆర్ నిర్ణయంతో సింగరేణి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సింగరేణి వ్యాప్తంగా 14 ఏరియాల్లో 43,898 మంది కార్మికులు, ఉద్యోగులు మరో ఏడాది నౌకరీ చేయబోతున్నారు. మార్చి నెల చివరిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులకు మళ్లీ నౌకరీలు వచ్చేస్తున్నాయి. మార్చి నుంచి జూలై వరకు కార్మికులు 1,051 మంది, ఉద్యోగులు 40 మంది పదవీ విరమణ చేశారు. వారంతా ఆగస్టు 14వ తేదీ నుంచి మళ్లీ నౌకరీలకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల చివరి వరకు దిగిపోయినవారు దరఖాస్తు చేసుకుంటే మెడికల్ ప్రాసెస్ ద్వారా నౌకరీలు ఇవ్వనున్నారు.
గొప్ప అవకాశం
సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో ఏడాది పెంచడం హర్షనీయం. ఉద్యోగుల అనుభవం బొగ్గు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది కార్మికులకు లబ్ధి చేకూరింది. ఈ నెల నుంచే ఉద్యోగులు, కార్మికుల విధుల్లోకి చేరుతారు. ఇలాంటి అవకాశం గతంలో ఎప్పుడూ రాలేదు.
-బలరాం సింగరేణి డైరెక్టర్(పా)
ఊహించని నిర్ణయం
ఎవరూ ఊహించని మంచి నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఏదైనా సీఎం కేసీఆర్‌కే సాధ్యం. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రతి పథకం అమలు చేసే వరకు పట్టువదలరు.
-నాగభూషణ్‌రెడ్డి, జీఎం సీపీ అండ్ పీ కొత్తగూడెం
కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాం
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణ ఉద్యమ్యంలో కార్మికుల పాత్ర మరువలేనిది. కార్మికులపై అభిమానంతో సీఎం కేసీఆర్ పదవీ విరమణ వయస్సు పెంచారు. ఈ నిర్ణయం కోలిండియా చరిత్రలో నిలిచిపోతుంది.
-బి.వెంకట్రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు