
ఇంటికొచ్చి చెక్కులిచ్చిన ఘనత తెలంగాణ సర్కార్‌దే
గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించాయి
‘విజన్’ ఉన్న మహానేత సీఎం కేసీఆర్
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
రఘునాథపాలెం, ఆగస్టు 12: పేదింట్లో పుట్టిన ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో పెళ్లి సమయంలో ఆర్థిక భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని 2, 5, 6, 8, 12, 13 డివిజన్లలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను గురువారం వారి ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా తమ ఇంటికి విచ్చేసిన మంత్రిపై ప్రజలు పూల వర్షం కురిపించి నీరాజనాలు పలికారు. మహిళలు తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెక్కుల పంపిణీని ఉద్దేశించి మంత్రి అజయ్ మాట్లాడారు. ఇంటి ముందుకొచ్చి సంక్షేమ పథకాల చెక్కులు అందిస్తున్న ఘనత టీఆర్ఎస ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా నిత్యం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే ‘విజన్’ ఉన్న మహానేత సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు.
‘సారె’తో చెక్కుల పంపిణీ..
లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను మంత్రి ‘సారె’ రూపంలో ఆడపడులకు ఆందజేశారు. చీర, పండ్లు, తాంబూలంగా కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. దీంతో తమ బిడ్డే వచ్చి తన చెల్లి పెళ్లికి కానుకలను అందిస్తున్నాడని ఆడపిల్లల తల్లిదండ్రులు మురిసిపోయారు. కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, చిరుమామిళ్ల లక్ష్మి, కొత్తపల్లి నీరజ, కూరాకుల వలరాజు, కమర్తపు మురళి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, టీఆర్ఎస్ నాయకులు దేవభక్తిని కిశోర్‌బాబు, నర్రా ఎల్లయ్య, హెచ్చు ప్రసాద్, కుర్రా మాధవరావు, షేక్ వలీ, తోట ప్రసాద్, కొడెం తార, బాజీ బాబా, గిర్దావర్లు పగడాల రాజేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టే పలు అభివృద్ధి పనులకు పువ్వాడ జయ్‌కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరం 15వ డివిజన్ గొల్లగూడెం రోడ్డులోని మధురానగర్‌లో రూ.99 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 7వ డివిజన్లో టేకులపల్లి నుంచి ఖానాపురం ప్రధాన రహదారి వరకు రూ.కోటి వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు విస్తరణ పనులకు గాను హనుమాన్ టెంపుల్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, టీఆర్ఎస్ నాయకులు లింగనబోయిన లక్ష్మణ్, దొంగల తిరుపతిరావు, చిలకల వెంకటనర్సయ్య, పొదిల పాపారావు తదితరులు పాల్గొన్నారు.
నిరంతరాయంగా సంక్షేమ పథకాలు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అవి ఆగవని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో వైద్య చికిత్స చేయించుకున్న కొందరు పేదలు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా వారికి ఆర్థికసాయం మంజూరైందన్నారు. ఆ సాయం చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా 35 మందికి మంజూరైన రూ.12.46 లక్షల చెక్కులను గురువారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,781 మందికి రూ.7.60 కోట్ల సహాయ నిధిని అందించినట్లు వివరించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.