చుంచుపల్లి, అక్టోబర్ 13 : కొత్తగూడెం సహకార సంఘం ఆధ్వర్యంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీర్మానం చేయడం జరిగిందని సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయంలో సమావేశం ఏర్పాటు కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయుటకు గాను 12 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే కొత్తగూడెం మండలం కొత్తగూడెం సహకార సంఘం పరిధిలో నాలుగు మండలాల రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయుటకు గాను అధికంగా యూరియా కేటాయించాలని కోరుతూ తీర్మానం చేయడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ కొత్తగూడెం సంఘంనకు కేటాయించిన గరిమెళ్లపాడు రెవెన్యూలో గల స్థలంలో సింగరేణి సేఫ్ నిధుల నుండి గోదాము, ఆఫీస్ నిర్మాణం చేపట్టుటకు తీర్మానం చేసినట్టు వీర హనుమంతరావు తెలిపారు. తీర్మానంను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావుకు అందజేయడం జరిగిందన్నారు.
అనంతరం ములకలపల్లి సంఘానికి బదిలీ అయిన కొత్తగూడెం సెక్రటరీ పండ్ల సారయ్యను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. నూతన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన నడికట్టు వెంకటరమణ రెడ్డిని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కూచిపూడి జగన్నాధరావు, సొసైటీ డైరెక్టర్లు వేల్పుల మల్లేష్, బండి అమృత రావు, గుగులోతు చందర్, కర్ణాటక రామచందర్రావు, తిట్ల విజయకుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు, గోగులోతు విజయ, కంటెం సత్యనారాయణ, సంఘం సెక్రటరీ నడికట్టు వెంకటరమణ రెడ్డి, పండ్ల సారయ్య, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.