భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. స్థానిక ఐడీవోసీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, డిజిటల్ విద్య, ఉపకార వేతనాలు తదితర ప్రోత్సాహకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరూ పాఠశాలల్లో చేరేలా చూడాలన్నారు. బడి మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, మహిళా సమాఖ్యల ద్వారా వారి తల్లిదండ్రులతో మాట్లాడి అర్హత కలిగిన తరగతుల్లో తిరిగి చేర్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈవో వెంకటేశ్వరాచారి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి, మైనార్టీ సంక్షేమాధికారి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు.