ఖమ్మం/ భద్రాచలం/ కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఏప్రిల్ 5: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. జగ్జీవన్‌రామ్118వ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. భద్రాద్రి ఐడీవోసీలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన ఆయన అకుంఠితదీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారన్నారు.
ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మనం ఆశించే మార్పు మన ఇంటినుంచే ప్రారంభించాలనే సూక్తిని బాబూ జగ్జీవన్‌రామ్ పాటించారని గుర్తుచేశారు. భద్రాచలం ఐటీడీఏలో పీవో రాహుల్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ది అలుపెరగని పోరాటమని అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలోనూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. అణగారినవర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు.