చింతకాని, సెప్టెంబర్ 10 : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వరికూటి సుబ్బారావు అన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకే చింతకాని పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన సిబ్బంది హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు.
గర్భిణులు, జనరల్ వార్డు, ల్యాబ్ టెస్టులు, మెడికల్ స్టోర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇంటింటా జ్వర సర్వే తీరును డాక్టర్ అల్తాఫ్‌ను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వో వచ్చిన సమయానికి పీహెచ్సీలో రోగులు ఎక్కువగా ఉండడంతో పల్లె దవాఖానల్లో చూపించుకోవాలని వారికి సూచించారు.
పల్లె దవాఖానల్లో వైద్య సిబ్బంది తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, అవసరాన్ని బట్టి వారి కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి మహ్మద్ అల్తాఫ్, సిబ్బంది సైదులు, శ్రీనివాస్, ఉదయ్, అరుణ పాల్గొన్నారు.