కొత్తగూడెం క్రైం, జూన్ 25 : దేశంలోని నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం-2023పై జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి నెల రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు మంగళవారం ముగిశాయి. కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బందికి డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సింగరేణి ఉమెన్స్ కళాశాల కన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ చట్టాలు అమలులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో శిక్షణా తరగతులు నిర్వహించామని తెలిపారు. కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు.
నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా నూతన చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించడంలో సమన్వయాధికారిగా వ్యవహరించిన డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బందికి శిక్షణా తరగతుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్లను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. నెల రోజులపాటు సమయపాలన పాటిస్తూ అందరికీ అర్థమయ్యేలా తరగతులు బోధించిన సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణాప్రతాప్లను ఎస్పీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ముప్పారపు కరుణాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మడిపెల్లి నాగరాజు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కాగితోజు శివప్రసాద్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, పీఆర్వో దాములూరి శ్రీనివాస్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.