మణుగూరు టౌన్/కరకగూడెం, జూలై 25 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటోలు నడవక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, పథకం ప్రవేశపెట్టే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పినపాక నియోజకవర్గంలోని ఐదు మండలాల ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లు మణుగూరు పట్టణంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. తొలుత మణుగూరు సురక్ష బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న ఆటో డ్రైవర్లు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని సముదాయించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు పలువురు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల ఆటోలు ఎక్కేవారు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఆటోలు నడవకపోవడంతో కిస్తీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలను నమ్ముకొని జీవిస్తున్న తమకు ప్రతీ నెల రూ.2 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాటను విస్మరించిందని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు. అనంతరం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్నదని, ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందన్నారు. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. కాగా.. కరకగూడెం మండలంలోని ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తొలుత కరకగూడెంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ర్యాలీగా మణుగూరు పట్టణానికి బయలుదేరారు. కార్యక్రమంలో మణుగూరు, అశ్వాపురం, పినపాక, బయ్యారం, కరకగూడెం, జానంపేటకు చెందిన ఆటోలు, టాటా మ్యాజిక్ యూనియన్ నాయకులు వీరాచారి, సతీశ్‌కుమార్, ఆనంద్ మోరియా, భాస్కర్, రామకృష్ణ, లింగమల్లు, భాస్కర్, కోటి, నాగరాజు పాల్గొన్నారు.