ఖమ్మం రూరల్, మే 5 : ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఆటో డ్రైవర్ ఆమె మెడలోని నగలు కొట్టేయడంతోపాటు రాయితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రూరల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు కథనం ప్రకారం.. చింతకాని మండ లం పందిళ్లపల్లికి చెందిన అలువాల రాంబాయి తన సమీప బంధువుల పెళ్లికి వెళ్లేందుకు రూరల్ మండలం బైపాస్‌రోడ్‌లోని రామలీల ఫంక్షన్ హాల్‌కు బయలుదేరింది.
బస్సులో ఖమ్మం పాత బస్టాండ్‌కు 12.30కు చేరుకుంది. ఫంక్షన్ హాల్ అడ్రస్ కోసం తన వద్ద ఉన్న పెళ్లి కార్డును అక్కడే ఉన్న కొందరు ఆటో డ్రైవర్లకు చూపించింది. స్టాండ్‌లో కాకుండా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆటో ఎక్కింది. తాను వెళ్లాల్సిన ఫంక్షన్ హాల్ అడ్రస్ కోసం ఆటో డ్రైవర్‌కు పెళ్లి కార్డు చూపించింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న సదరు డ్రైవర్ ఆరెకోడు మీదుగా 1.30 నిమిషాల సమయంలో గూడూరుపాడు రోడ్‌లోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అనుమానం వచ్చిన మహిళ ఇటు ఎందుకు తీసుకొచ్చావు.. అని ప్రశ్నించేలోగానే ఆమె మెడలోని బంగారు చైన్, కాళ్ల వెండి పట్టీలు లాక్కున్నాడు. ప్రతిఘటించిన మహిళపై రాయితో దాడి చేయడంతో కేకలు వేసింది. దగ్గరలో ఉన్న గొర్రెల కాపరి కుర్రి రామయ్య ఆమె వద్దకు వచ్చే ప్రయత్నం చేశాడు.
ఈలోగా ఆటో డ్రైవర్ సొమ్ములతో అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న రామయ్య జరిగిన సంఘటనను గూడూరుపాడు సర్పంచ్ ఉపేందర్‌కు చేరవేశాడు. సర్పంచ్ రూరల్ పోలీసులకు విషయాన్ని చెప్పారు. నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళను 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాంబాయి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.