ఆషాఢమాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బోనాల పండుగ ఆదివారం వైభవంగా జరిగింది. ఖమ్మం, సత్తుపల్లి, నేలకొండపల్లి ప్రాంతాల ప్రజలు అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలు సమర్పించారు. ఖమ్మం త్రీటౌన్లోని పలు కాలనీలకు చెందిన ప్రజలు ఏటా ఆషాఢమాసంలో అమ్మోరు తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ ఆదివారం కూడా ఆయా కాలనీల మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో బయలుదేరారు.
డప్పువాయిదాలు, శివసత్తులు నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, ఆటాపాటలు, నృత్యాలతో వెళ్లి ఆ బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. శ్రావణమాసానికి ముందుగా వచ్చే ఆషాఢబోనాలను అమ్మవారికి సమర్పించే వేడుక కావడంతో ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సత్తుపల్లి, నేలకొండపల్లి, జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల ప్రజలు కూడా ముత్యాలమ్మ అమ్మవారికి, అంకమ్మతల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
– ఖమ్మం వ్యవసాయం/సత్తుపల్లి/జూలూరుపాడు/అశ్వారావుపేట టౌన్/కూసుమంచి (నేలకొండపల్లి), జూలై 14