ఇల్లెందు/ భద్రాచలం/ దమ్మపేట రూరల్, జనవరి 10: సమస్యలు పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేటల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఇళ్లను శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆయా పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.18 వేల కనీసం వేతనం ఇవ్వాలని, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ప్రమోషన్ కల్పించాలని, రూ.50 లక్షల బీమా ఉత్తర్వులు జారీ చేయాలని, ఆదివారాలు, పండుగ రోజుల్లో సెలవులు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు చెల్లించాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని,
మెడికల్ లీవులు మంజూరు చేయాలని, పనిభారం తగ్గించాలని, పెండింగ్ గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఆసుపత్రుల్లో రెస్టు రూంలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి సమస్యలు విన్నవించినా నేటికీ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.