మామిళ్లగూడెం, డిసెంబర్ 4 : ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వేతనాలు పెంచాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతిబాయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మోహన్‌రావు, పి.రమ్య, మంగమ్మ, నాగమణి, రాణి, రాధ, కళ్యాణి, జ్యోతి, కమల, విజయ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 4 : తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ అప్పారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్‌లు మాట్లాడారు. ఆశ వర్కర్లకు రూ.18 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, లెప్రసీ, పల్స్ పోలియో సర్వేల పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పద్మ, ధనలక్ష్మి, జయ, రుక్మిణి, విజయ, సుశీల, భాగ్య, చంద్రకళ, కిరణ్మయి, హైమావతి, చిన్నక్క తదితరులు పాల్గొన్నారు.