‘అమ్మా..’ అనే పిలుపు వినపడగానే ‘నేనున్నానమ్మా..’ అంటూ పరుగెత్తుకొని వెళ్లి గర్భిణులు, బాలింతలకు అమూల్యమైన సేవలందిస్తున్న ఆశా కార్యకర్తల జీవితాలు అంతులేని దుర్భరాన్ని ఎదుర్కొంటున్నాయి. అరకొర వేతనాల కారణంగా వారి కుటుంబాలు అర్ధాకలితో నెట్టుకొస్తున్నాయి. వైద్యారోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో ఎంతో కీలకంగా ఉన్న ఆశా కార్యకర్తలతో బారెడు పని చేయించుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం.. కనీసం వారికి జానెడు జీతమూ ఇవ్వడం లేదు. ఇచ్చే అరకొర వేతనమూ సక్రమంగా అందించడం లేదు.
కొండలు, గుట్టలు ఎక్కుతూ రెక్కలు ముక్కలు చేసుకొని చేసిన సర్వేలకు సైతం సరైన పారితోషికం ఇవ్వడం లేదు. ఇలా విరామం లేకుండా పనులు చేయించుకుంటున్న పాలకులు.. వేతనాలను సరైన సమయంలో ఇవ్వకుండా వారిని పస్తులు ఉంచుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించినా, దఫాలుగా ధర్నాలు చేసినా.. రేవంత్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదు. అదీగాక ఎన్నికల హామీలపైనా అసలు నోరు మెదపడం లేదు. దీంతో కాంగ్రెస్ సర్కారుపై కన్నెరచేసిన ఆశా కార్యకర్తలు.. ఈ నెల 10 హైదరాబాద్‌లో కమిషనరేట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న రేవంత్ ప్రభుత్వం.. వారి ఆకలిదప్పుల గురించి కనీసంగానూ ఆలకించడం లేదు. ఎండల్లో కొండలెక్కుతూ, గుట్టలు దిగుతూ.. వానల్లో నిండైన వాగులు దాటుతూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ సేవలందిస్తున్న ఆశా కార్యకర్తల ఆకలి బాధలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోవడం లేదు.
పల్స్‌పోలియో టీకాలు అందించడం మొదలుకొని లెప్రసీ సర్వే చేయడం, టీబీ రోగులకు మందులు అందించడం, గర్భిణులను సకాలంలో ఆసుపత్రులకు తీసుకెళ్లడం, ప్రసవానంతరం వారిని తిరిగి ఇళ్లకు తీసుకురావడం, అన్ని ఆరోగ్య సమస్యల్లోనూ ఆసరాగా నిలబడడం వంటి అమూల్యమైన సేవలను ఎంతో అంకితభావంతో అందిస్తున్న ఆశా కార్యకర్తలు చాలీచాలని వేతనాలతోనే కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు ఎన్నో వరాలు కురిపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వారివైపు చూసిన పరిస్థితి కూడా లేదు. ధర్నాలు చేసినా కనీస స్పందన లేదు.
వైద్యారోగ్యశాఖలో ప్రతి పనినీ చేసుకొస్తున్న ఆశాలకు ప్రస్తుత పాలకుల కారణంగా పస్తులు తప్పడం లేదు. ఏకంగా సర్వేల పారితోషికాలకూ ఎగనామం పెట్టడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా కన్పిస్తోంది. ఆశాలు ఏటా 14 రోజులపాటు లెప్రసీ సర్వే చేస్తారు. అందుకు వారికి రోజుకు రూ.70 చొప్పున ప్రభుత్వం పారితోషికం ఇవ్వాల్సి ఉంది. గడిచిన మూడేళ్ల పారితోషికాలు ఇంకా బకాయిలుగానే ఉండిపోయాయి. పల్స్‌పోలియో సర్వే మూడు రోజులపాటు చేస్తారు.
అందుకు రోజుకు రూ.200 చొప్పున అందాల్సిన పారితోషికం బకాయిలు ఏడాదిగా ఇవ్వడమే లేదు. ఇదేగాక టీబీ రోగుల నుంచి సేకరించిన తెమడ నమూనాలను ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి పరీక్షలు చేయించాలి. ఆరు నెలలపాటు బాధితులతో మందులు వాడించాలి. ఈ పనుల కోసం ఆశాలకు ఏడాదికి రూ.5,000 ఇస్తారు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల దానికీ ఎగనామం పెట్టింది. పారితోషికం గురించి రాష్ట్ర అధికారులను అడిగితే.. హైదరాబాద్ నుంచి జిల్లాకు బడ్జెట్ ఇచ్చామని చెబుతున్నారని, జిల్లా అధికారులకు మొరపెట్టుకుంటే హైదరాబాద్ నుంచి రాలేదని చెబుతున్నారని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తుండడం దయనీయమైన విషయం.
అయితే, ఆశాలకు ఇచ్చిన ఎన్నికల హామీలపై రేవంత్ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. దీంతో కాంగ్రెస్ సర్కారుపై ఆశాలు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామంటూ ఇచ్చిన హామీపై నిలదీస్తున్నారు. దానిని నెరవేర్చకపోగా.. కనీసం బకాయిలు విడుదల చేకపోవడం పట్ల గుర్రుగా ఉన్నారు. నెలకు రూ.9,750 చాలీచాలని వేతనం ఇవ్వడంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తమకు అది ఎటూ చాలడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిక్స్డ్ వేతనం రూ.18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చే వేతనం చాలా తక్కువ. పనులు మాత్రం రోజంతా చేయిస్తున్నారు. ఏ సర్వే వచ్చినా మాతోనే చేయిస్తున్నారు. బాక్స్ చేతపట్టుకొని విధులు రెక్కలు ముక్కలు చేసుకున్నా పూట గడవడం కష్టంగా ఉంటోంది. మూడేళ్లుగా సర్వే పారితోషికం ఇవ్వలేదు. రోజు వారీ విధుల కోసం సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు.
-భూక్యా గంగ, ఆశా కార్యకర్త
సర్వే చేసిన ఆశా కార్యకర్తలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతానికి 25 శాతం బడ్జెట్ వచ్చింది. అంతవరకూ బిల్లులు క్లియర్ చేశాం. ఇంకా బడ్జెట్ రావాల్సి ఉంది. అది రాగానే మిగతా బిల్లులు చేస్తాం. మా వద్ద పెండింగ్ ఏమీ లేదు.
-డాక్టర్ భాస్కర్‌నాయక్, డీఎంహెచ్‌వో
పురిటి నొప్పులు మొదలైన గర్భిణులు.. ‘అమ్మా..’ అని పిలవగానే వాళ్లింట్లో వాలిపోతుంటాం. ఆసుపత్రులకు తీసుకెళ్లి తల్లీబిడ్డలను క్షేమంగా తిరిగి తీసుకొస్తాం. ఇలాంటి ముఖ్యమైన సేవలందిస్తున్న మాకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. గుట్టలెక్కి మరీ టీకాలు వేస్తాం. కానీ సరైన వేతనాలకు నోచుకోలేకపోతున్నాం.
-ధర్మపురి దేవి, ఆశా కార్యకర్త