పాల్వంచ/ మధిర, ఏప్రిల్ 15 : శాసనసభ ఎన్నికల సమయంలో ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని పలువురు కార్మికులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం 8వ రోజుకు చేరింది. పాల్వంచ కేటీపీఎస్‌లోని మూడు కర్మాగారాల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు శిబిరం వద్దకు చేరుకొని సమ్మెలో కూర్చున్నారు.
మధిర డివిజన్ కార్యాలయ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కార్మికులు విధులు బహిష్కరించి తమ నిరసన తెలియజేశారు. 327, 1104 యూనియన్లకు చెందిన ప్రధాన బాధ్యులు మరోసారి శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు కార్మిక నాయకులు, కార్మికులు మాట్లాడుతూ యాజమాన్యం మొండివైఖరి వీడి కార్మికుల సమస్యలను తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేశారు. ఏళ్లతరబడి పనిచేస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ సమస్యలను పరిషరించే వరకు సమ్మెను ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సమ్మెకు ఐఎన్టీయూసీ నుంచి జలాల్, బాలు, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకులు అనిల్‌కుమార్, గోనెల రమేశ్, వేల్పుల రమేశ్, కుంజా భాస్కర్లు సంఘీభావం తెలిపారు.