అశ్వారావుపేట/ లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 5 : బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసిన నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తారనే అనుమానంతో భద్రాద్రి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండో రోజు బుధవారమూ అరెస్టు చేయించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయా మండలాల్లో బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లారు. ఇళ్లలో ఉన్న నాయకులకు కారణాలు కూడా చెప్పకుండా అక్రమంగా అదుపులోకి తీసుకొని మరీ పోలీసుస్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి పీఎస్‌కు తీసుకెళ్లారు. ఇక, అశ్వారావుపేట మండలంలోనూ అరెస్టులు కొనసాగాయి.
ఇక్కడ బీసీ రిజర్వేషన్ల ఆందోళనలతోపాటు పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌లు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మాజీ సర్పంచ్ల ఆందోళనతో సంబంధం లేని బీఆర్ఎస్ నేతలను కూడా నిర్బంధించారు. అశ్వారావుపేటలో మాజీ సర్పంచ్‌లు నారం రాజశేఖర్, కలపాల దుర్గయ్య, సోనీ శివశంకర్ వరప్రసాద్లతోపాటు బీఆర్ఎస్ నాయకులు సత్యవరపు సంపూర్ణ మోటూరి మోహన్, చరణ్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, బీఆర్ఎస్ నాయకుల అరెస్టును ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు తీవ్రంగా ఖండించారు.