కారేపల్లి, మార్చి 19 : ఈ నెల 21 నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జిల్లా కారేపల్లి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు మండలంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిషత్ హైస్కూల్ కారేపల్లిలో 240 మంది, జిల్లా పరిషత్ కోట్లగూడెంలో 160మంది, తెలంగాణ మోడల్ పాఠశాలలో 140 మంది విద్యార్థులు పరీక్షలు రాయన్నుట్లు వెల్లడించారు.
ఈ మూడు సెంటర్లను సందర్శించి ఫర్నిచర్, విద్యుత్, సౌకర్యవంతమైన గదులు, తాగునీరు తదితర ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సీ సెంటర్ కోమట్లగూడెంలో పరీక్ష నిర్వహకులను అప్రమత్తంగా ఉండి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయమన్నారు. ఇప్పటికే అన్ని సెంటర్లకు జవాబు పత్రాలు చేరాయన్నారు. విద్యార్థులు 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం మించి పరీక్ష కేంద్రానికి వస్తే అనుమతించటం జరగదన్నారు. రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గాంధీనగరంలోనే ఉండి పరీక్షలకు హాజరు అవుతారని, అలాగే మేకలతండా, గేటా కారేపల్లి పాఠశాల విద్యార్థులను ప్రతీ రోజు పరీక్షలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.