బోనకల్లు, జూన్ 15 : ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలని, ఇది ప్రజా పాలనలో నిరంతర ప్రక్రియ అని జడ్పీ సీఈవో వినోద్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మండలంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎంపీడీవో రాజును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోని వారి కోసం మండల పరిషత్ కార్యాలయాల్లో మళ్లీ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దరఖాస్తులు తీసుకోలేదని, మళ్లీ యథావిధిగా దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన 2022లో 17వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన రూ.10 లక్షల నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు. వీటికి సంబంధించిన బిల్లులతోపాటు మెజర్మెంట్స్ రికార్డులను పంపించాలని వైద్యాధికారి స్రవంతిని ఆదేశించారు. ఆ నిధులతో చేపట్టిన వివిధ పనులను ఆయన పరిశీలించారు. సీఈవో వెంట ఎంపీడీవో రాజు, ఎంపీవో కోటేశ్వరశాస్త్రి తదితరులు ఉన్నారు.