కారేపల్లి, అక్టోబర్ 08 : ఖమ్మం జిల్లా సింగరేణి ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాల ఏర్పాట్లు లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీఐ ఎం. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కారేపల్లి మండల కేంద్రంలో 1, 2, 3 షాపులు జనరల్, 4వ షాపు ఎస్టీ, కామేపల్లి మండలంలో 3 దుకాణాలు ఎస్టీ, ఏన్కూరు మండలంలో మూడు దుకాణాలు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించినట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 18వ తేదీ లోపు రూ.3 లక్షలు డిడి లేదా చలానాలు తీసి జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆమె సూచించారు. ఈ నెల 23న లక్కీ డ్రా తీయనున్నట్లు పేర్కొన్నారు.