బోనకల్లు మార్చి 19 : రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా రేషన్ కార్డులు మంజూరు విషయంలో ఇప్పటికీ జాప్యం చేస్తుందన్నారు. మార్చి 8న రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి రెండు వారాలు కావస్తున్నా రేషన్ కార్డుల ఊసే లేదన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఆదిలోనే హంసపాదులా మారిందని విమర్శించారు. యువకులు, నిరుద్యోగులు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి రేషన్ కార్డు లేకపోవడం, రేషన్ కార్డులో పేరు లేకపోవడంతో శాపంలా మారిందన్నారు. ఇప్పటికైనా రేషన్ కార్డులను మంజూరు చేసి యువ కుటుంబాలకు పథకాలకు దగ్గర చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు తూము రోషన్ కుమార్, మండల సహాయ కార్యదర్శులు జక్కుల రామారావు, ఆకెన పవన్, నాయకులు ఏనుగు రవికుమార్, కొంగర భాస్కరరావు, గుంపుల జయరాజు పాల్గొన్నారు.