కొత్తగూడెం అర్బన్, మే 15: రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ వారసులుగా సమ్మక్క సారలమ్మల పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న తెలంగాణ గడ్డపై.. ఇక్కడి ఆడబిడ్డలతో అందాల భామల కాళ్లు కడిగించడమేంటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ దృశ్యాలను చూసి యావత్ సమాజం నివ్వెరపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే సీఎం క్షమాపణ చెప్పాలని, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసలు ఈ అందాల పోటీలతో రాష్ర్టానికి ఒరిగేదేముందని ప్రశ్నించారు. ‘ఈ పోటీల నిర్వహణ వల్ల వరంగల్, హైదరాబాద్ నగరాల ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?’ అంటూ నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాల వల్ల దేశంలో తెలంగాణ పేరు అధఃపాతాళానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రూ.200 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న ఈ అందాల పోటీల వల్ల తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? ఉపాధి అవకాశాలేమైనా పెరుగుతాయా?’ అని ప్రశ్నించారు. అందాల భామలు వరంగల్ వస్తున్నారని మోరీలు కనపడకుండా పరదాలు కట్టారని, రోడ్ల వెంట ఉన్న చిరువ్యాపారుల దుకాణాలను తొలగించారని అన్నారు.
ఇది ఎంత వరకూ సమంజసమో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్‌కు వచ్చిన అందాల భామల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడాన్ని తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌లో బానిసత్వపు ఆనవాళ్లు ఇంకా పోలేదని విమర్శించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు బాదావత్ శాంతి, తొంగరు రాజశేఖర్, వేముల ప్రసాద్‌బాబు, పల్లపు రాజు, సింధు తపస్వి, రామిళ్ల మధుబాబు, ఖాజా భక్షి, సతీశ్, మునీర్, పురుషోత్తం, పూర్ణచందర్, జయరాం తదితరులు పాల్గొన్నారు.