ఖమ్మం రూరల్, నవంబర్ 08 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగు చూసింది. వారం రోజుల క్రితం ఇదే గ్రామంలో నాగమణి అనే మహిళను సొంత తమ్ముడు హత్య చేయించిన ఘటన మరువకముందే మరో హత్య జరగడంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తగూడెం గ్రామానికి చెందిన బుర శ్రీనివాసరావు (45) ఖమ్మం నగరంలోని ఓ స్వీట్ షాపులో దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 6న సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన వరుసకు సోదరుడైన ఓ వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి బైపాస్ రోడ్ లో శ్రీనివాస్ రావును అటకాయించారు. తమ వెంట తెచ్చుకున్న కారులో తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే రాత్రి వరకు శ్రీనివాసరావు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య ఖమ్మం రూరల్ పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లడం జరిగింది.
దీంతో శుక్రవారం నుండి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఖమ్మం నగర శివారులోని సాగర్ కాల్వలో శ్రీనివాస్ మృతదేహం వెలుగు చూడడంతో ఒక్కసారిగా ముత్తగూడెంలో భయాందోళనలు రేకెత్తాయి. మృతుడు శ్రీనివాసరావు భార్య అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు గ్రామంలో జోరుగా చర్చ జరుగుతుంది. మృతుడు శ్రీనివాసరావుకు సోదరుడి వరుసైన వ్యక్తితో పాటు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఇద్దరు కలిసి హత్య చేసి సాగర్ కాల్వలో పడేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. సంఘటనకు సంబంధించి ఖమ్మం రూరల్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే ప్రధాన నిందితుడు రూరల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా వారం రోజుల వ్యవధిలోనే ఓ మహిళ, మరో యువకుడు హత్యగావింపబడం పట్ల గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.