ఖమ్మం, ఫిబ్రవరి 2: ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలన్నీ ఒకేచోట కల్పించేందుకు గాను ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో వీటిని నిర్మిస్తున్నారు. ఖమ్మం నగరంలో మరో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే నగరంలోని నూతన బస్టాండ్ పక్కన రూ.4 కోట్లతో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. ఇప్పుడు మరో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చర్యలు తీసుకున్నారు. దీంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ చుట్టూ కాంపౌండ్ నిర్మించారు. ముందు భాగాన రైతులు, కూరగాయలకు సంబంధించిన అందమైన బొమ్మలను చిత్రకారులతో గీయిస్తున్నారు. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వసతులతో..
ప్రతీ పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారం, వైకుంఠధామాలు తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రజలకు మరిన్ని వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు సహా ఇతర నిత్యావసర వస్తువులన్నీ ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను నిర్మించారు. ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీలో రూ.4.50 కోట్లతో తాజాగా నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 2.01 ఎకరాల సువిశాల స్థలంలో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను నిర్మించారు. ఈ మార్కెట్లో 65 వెజ్ స్టాళ్లు, 23 ఫ్రూట్ స్టాళ్లు, 46 నాన్ వెజ్ స్టాళ్లు కలిపి మొత్తం 134 స్టాళ్లతో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ తరువాత అంతటి ఘనమైన వసతులతో, ప్రజలకు నిత్యం అవసరమయ్యే కూరగాయలు, నాన్ వెజ్, పండ్లు తదితర వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయి. వాల్ పెయింట్స్, షెడ్స్, నీటి వసతి, విద్యుత్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇల్లెందు క్రాస్ రోడ్డు మార్కెట్ తరలింపు..
ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న రైతుబజార్‌ను మూసి వేసేందుకు అధికారులు నిర్ణయించారు. వీడీవోస్ కాలనీలో త్వరలో నిర్మించనున్న రెండో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోకి దీనిని తరలించనున్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలంటూ అధికారులు రైతుబజార్, పటేల్ స్టేడియం వద్ద ఫ్లెక్లీలను ఏర్పాటు చేశారు. ఈ రైతుబజార్ స్థలంలో ఐటీ హబ్ రెండో పేజ్‌ను నిర్మించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం..
రోజురోజుకూ పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా నగరంలో పలు చోట్ల వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నిర్ణయించారు. ఆయన ప్రత్యేక కృషి వల్లనే వీడీవోస్ కాలనీలో రూ.4.5 కోట్లతో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. అతి త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. కూరగాయలు, పండ్లు, చేపలు, మటన్, చికెన్ తదితరాలన్నీ ఈ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -పునుకొల్లు నీరజ, మేయర్, కేఎంసీ