మధిర/ముదిగొండ, జూలై 20 : వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మధిర నియోజకవర్గంలోని రైతులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తుంటే.. అందుకు విరుద్ధంగా రేవంత్రెడ్డి మాట్లాడడంపై బోనకల్లు, ముదిగొండ మండలాలకు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ జోలికొస్తే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గురువారం ముష్టికుంట్ల రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు తమ మనోభావాలను వెల్లడించారు.
మూడు గంటలు కూడా ఇవ్వలేరు
ప్రజలు తప్పు చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తే రైతులకు మూడు గంటల కరెంటు కూడా ఇవ్వలేరు. ఆనాడు రాత్రివేళల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఇచ్చేది. అనేక మంది రైతులు కరెంటు షాక్కు, పాముకాటుకు గురై మృతిచెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 24 గంటలు కరెంటు రైతులకు సీఎం కేసీఆర్ అందిస్తుంటే మూడు గంటల కరెంటే సరిపోతుందనడం రైతులను నష్టపెట్టే విధంగా ఉంది.
-పండగ సీతారాములు, రైతు, ముష్టికుంట్ల
రైతులకు అండగా బీఆర్ఎస్
బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుంది. ఇప్పటివరకు స్వేచ్ఛగా కరెంటును ఉపయోగించుకొని పుష్కలంగా పంటలు పండించుకుంటున్నాం. రేవంత్రెడ్డి మూడు గంటలు కరెంటు చాలన్న వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. రైతాంగానికి ఎన్ని గంటలు కావాలి, ఎప్పుడు కావాలి అన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించి రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. కాంగ్రెస్కు గుణపాఠం చెబుతాం.
-పిల్లెం వెంకటేశ్వర్లు, రైతు, చిరునోముల
అప్పుడు కరెంటే లేదు
నాడు కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటే ఇవ్వలేదు. అప్పుడు భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకున్నాం. కరెంటు లేక పంటల ఎండిపోయేవి. ఇప్పుడు సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తుండడంతో రెండు పంటలు పండించుకుంటున్నాం. రేవంత్రెడ్డి మూడు గంటలు కరెంటు సరిపోతుందని అనడం రైతులను ఇబ్బంది పెట్టేలా ఉంది. రైతులే ఆయనకు బుద్ధి చెప్పాలి.
-షేక్ ఇబ్రహీం, రైతు, ముష్టికుంట్ల
అప్పుడు పగలే కరెంటు లేదు
నేను 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. కాంగ్రెసోళ్ల హయాంలో పగలు పట్టుమని గంట కూడా కరెంటు లేదు. కరెంటు ఎప్పుడొస్తదా అని ఎదురుచూసేటోళ్లం. తెలంగాణ వస్తే కరెంటు, నీళ్లు ఉండవు అంటే భయపడ్డా. కానీ.. నేడు ఆ పరిస్థితి లేదు. ఎన్ని పంటలు పండించినా సరిపోయే కరెంటు, నీళ్లు ఉంటున్నాయి. సీఎం కేసీఆర్ సారు సల్లంగుండాలి. మల్లా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలి.
-కొమ్మూరి వెంకయ్య, రైతు, ముదిగొండ
అరెకరం కూడా తడవదు
రేవంత్రెడ్డి ఎకరం భూమికి గంటలో నీళ్లు పెట్టొచ్చన్న మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. గంటకు కనీసం అరెకరం పొలం కూడా తడవదు. వాళ్ల పాలనలో ఇచ్చిన కరెంటుతో ఒక వైపు పంట తడిస్తే.. మరో వైపు తడవక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ.. సీఎం కేసీఆర్ సారు వచ్చాక వ్యవసాయం పండుగలా మారింది. సాగర్ నీళ్ల్లు ఇవ్వడమే కాక 24 గంటలూ కరెంటు ఇవ్వడం బాగుంది.
-మల్లెల వెంకటేశ్వర్లు, రైతు, ముదిగొండ
3 గంటలతో భూమి తడవదు
రేవంత్రెడ్డి అన్నట్లు మూడు గంటలు కరెంట్ ఇస్తే కుంట భూమి కూడా తడవదు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ పాలనను చూసి తట్టుకోలేక ఆయన మనస్సులో మాటను బయటపెట్టాడు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే.. రైతులకు విరుద్ధంగా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నాడు. మూడోసారి కూడా కేసీఆర్నే సీఎం చేసుకునే విధంగా రైతులు ముందుకు రావాలి.
-వేమూరి ప్రసాద్, తూటికుంట్ల, మండల రైతుబంధు కన్వీనర్