భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : గ్రామస్థాయి విధుల్లో అందరి నోళ్లలో నానే నౌకరి.. అంగన్వాడీ టీచర్. ‘వేతనం మూరెడు.. విధులు బారెడు..’ అనే దైన్యం వారిది. సొంత శాఖలో అసలు విధుల కంటే ఇతర శాఖల్లోని అదనపు బాధ్యతలే వీరికి అధిక భారాన్ని నెత్తిన పెడుతున్నాయి. వీధిలో ఎవరు కదిలినా మెదిలినా, ఊరి చివరన చీమ చిటుక్కుమన్నా.. ‘ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందించే బాధ్యత మీకు లేదా?’ అంటూ యంత్రాంగం నుంచి చీవాట్లు, చీత్కారాలు.
స్త్రీ, శిశు సంక్షేమంలో అత్యంత కీలకమైన విధుల్లో ఉండే అంగన్వాడీలు.. వైద్యారోగ్య, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు శాఖలు సహా ఎన్నికల సంఘం విధుల్లోనూ భాగస్వాములవుతున్నారు. పనిభారాలు, పడిగాపులతో సహవాసం చేసే అంగన్వాడీలది.. చివరికి సొంత శాఖల్లో ఆయాల విధులనూ చక్కదిద్దాల్సిన దయనీయ స్థితి. క్షేత్రస్థాయిలో ఎంతో క్రియాశీకంగా పనిచేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం పెడుతున్న పని భారాలపై ప్రత్యేక కథనం.
సొంత శాఖలోనే సవాలక్ష పనులతో క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు అంగన్వాడీ టీచర్లు. వివాహితలు గర్భం దాల్చిన దగ్గర నుంచి మొదలుకొని వారి ఆరోగ్య పరిరక్షణ, వారి కడుపులోని బిడ్డ సంపూర్ణ సంరక్షణ వంటివి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. గర్భిణి వయసు, ఎత్తు, బరువు నుంచి మొదలుకొని సమస్త సమాచారాన్నీ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.
యాప్‌లలోనూ డేటాను నిక్షిప్తం చేస్తుంటారు. చివరికి రాత్రి వేళల్లోనూ ఇదే విధుల్లో తలమునకలై ఉంటున్నారు. గర్భిణికి ప్రసవ సమయం దగ్గర పడినా, ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చినా ఆయా వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఇక ఆ బిడ్డ ప్రాథమిక విద్యాభ్యాసానికి వెళ్లేదాకా పర్యవేక్షణ చేస్తుంటారు. ప్రీ ప్రైమరీ బాధ్యతలనూ వీళ్లే చూస్తున్నారు. ఈ మధ్యలో ఆయా శివువుల బరువు, ఎత్తు సహా వారి సమస్త ఆరోగ్య పర్యవేక్షణ, సమాచార నమోదు వంటివన్నీ ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు. ఆ తరువాత ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు.
ఇవే క్షణం తీరికలేని పనులంటే.. వీటికి ఎన్నో రెట్లు అధికమైన అదనపు బాధ్యతలనూ వీరి నెత్తిన పెడుతోంది ప్రసుత్త ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లోని అత్యధిక శాతం అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాలతోనే వీరు నెట్టుకొస్తున్నారు. అయితే వీటి అద్దెలను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందనేది అంతుబట్టని అంశం. ఇక గ్యాస్ బిల్లులదీ అదే కథ. దీంతో వీటిని వీరు సొంతంగా భరిస్తూనే విరామం లేకుండా విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. అధికారుల ఆకస్మిక తనిఖీలు, విధుల్లో నిర్లక్ష్యమంటూ పెట్టే చీవాట్లు అదనం.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ సొంత శాఖ పనులను, అదనపు శాఖల విధులను చక్కదిద్దుతున్న అంగన్వాడీలకు రాత్రి వేళలో విశ్రాంతి దొరికే అవకాశమూ ఉండడం లేదు. శిశువుల జననాల దగ్గర నుంచి మొదలుకొని వారికి ఫీడింగ్ దాకా అన్ని అంశాలనూ మొన్నటి వరకూ 14 రకాల రికార్డుల్లో నమోదు చేసేవారు. ఇప్పుడు సాంకేతికతను ప్రభుత్వం చేతిలో పెట్టడంతో దాని విధుల్లోనూ తలమునకలు కావాల్సిన పరిస్థితి. ఇక రాత్రివేళ ఇంటికి చేరుకున్నాక సమగ్ర సమాచారాన్ని ఆయా యాప్‌లలో నమోదు చేస్తున్నారు. రాత్రి పది దాటినా, పన్నెండైనా ఆయా డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేశాకే నిద్రకు ఉపక్రమించాల్సిన స్థితి.
మాతృసంస్థ బాధ్యతలేగాక ఇతర అనేక శాఖల్లోనూ ప్రభుత్వం వీరిని భాగస్వామ్యం చేసింది. మిషన్ భగీరథ, ఓటర్ల జాబితా, జ్వరాలు, తల్లీపిల్లల సర్వేలను వీరే ప్రధానంగా నిర్వహిస్తున్నారు. పారిశుధ్య పనులు, అవగాహన కార్యక్రమాలు, గ్రామసభల వంటివి క్రమం తప్పకుండా ఉంటున్నాయి. పోక్సో కేసుల నమోదు వంటి అంశాల్లో ఒక్కోసారి వీరు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఇక బాల్య వివాహాలు జరిగితే మొదటి సమాచారం ఇవ్వాలి.. దాంతోపాటు ఆ సమయంలో పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు, కేసులు వంటివి ఉంటే స్టేషన్లలో రాత్రి వరకూ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఇన్ని అదనపు పనుల భారం ఉండడంతో ఒక్కోసారి సొంత శాఖ విధులకు కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 626 మినీ అంగన్వాడీలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. కానీ.. ఈ కేంద్రాలకు టీచర్ ఒక్కరే. ఆయాలు లేరు. దీంతో ఈ కేంద్రాల్లో ఆయాల విధులు కూడా అంగన్వాడీలే నిర్వహించాల్సిన పరిస్థితి. అయితే తాము అప్‌గ్రేడెడ్ కేంద్రాల్లో పనిచేస్తున్నప్పటికీ గత నెలలో తమకు మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకిచ్చే వేతనాలనే అందించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అనేక అదనపు బాధ్యతలు అప్పగిస్తోంది. దీంతో వారు అన్ని రకాల పనులను ఎలా నిర్వహించగలరు? మళ్లీ తమ అంగన్వాడీ కేంద్రాలను ఎలా నడపగలరు? అలాగే, 65 ఏళ్లకే అంగన్వాడీలను స్వచ్ఛందంగా దిగిపోవాలని చెప్పిన ప్రభుత్వం.. ఇచ్చిన మాట ప్రకారం వారికి సరైన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇక బీఎల్వోల డ్యూటీలు వేసి నరకం చూపిస్తున్నారు. పక్కనే కాన్వెంట్లకు అనుమతులిచ్చి అక్కడే అంగన్వాడీ కేంద్రం నడపమంటే ఎలా కుదురుతుంది?
-సీతామహాలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకురాలు
బీఎల్వోల డ్యూటీలను ఎవరైనా చేయాల్సిందే. ఎవరికీ మినహాయింపు ఉండదు. బడ్జెట్ ఆలస్యం అవడం వల్ల అద్దె బిల్లులు, గ్యాస్ బిల్లులు సకాలంలో రావడం లేదు. వాటిని వెంటనే పూర్తి చేసి వారికి చెల్లిస్తాం. కొత్త ఆయా పోస్టులను, ఖాళీ అయిన అంగన్వాడీ స్థానాలను భర్తీ చేస్తాం. రిటైర్మెంట్ అయిన టీచర్లకు రూ.రెండు లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం పారితోషికం ఇస్తుంది.
-విజేత, డీడబ్ల్యూవో, భద్రాద్రి జిల్లా