రఘునాథపాలెం/ కొత్తగూడెం గణేశ్ టెంపుల్/ ఖమ్మం కమాన్బజార్, మార్చి 23: తాము అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మెరుగైన వేతనాలిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని; పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా వంటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అదనపు పనికి అదనపు పారితోషికం ఇవ్వాలని అన్నారు. హామీలు అమలుచేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు, భద్రాద్రి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు సోమవారం ఆందోళన కార్యక్రమాలు పట్టారు. ఖమ్మంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆశా కార్యకర్తలు తొలుత ర్యాలీ, ఆ తరువాత రాస్తారోకో నిర్వహించారు. జడ్పీ సెంటర్లో మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలకు వారథులుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పైగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి బుద్ధిచెబుతామని స్పష్టం చేశారు.
తుమ్మల కాంపు ఆఫీసు ముట్టడి
ఎన్నికల హామీల అమలు, వేతనాల పెంపు డిమాండ్లపై సీఐటీయూ ఆధ్వర్యంలోనూ ఖమ్మంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం, నగరంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. బారికేడ్లు తొలగించుకొని లోనికి వెళ్తే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని వ్యాన్లలో ఎక్కించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.