భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సమస్త విధులతో అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. భద్రాద్రి జిల్లాలో అంగన్వాడీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బెస్తెడు జీతానికి బారెడు కష్టం చేయాల్సి వస్తోంది. తమ అంగన్వాడీ కేంద్రాల్లోని విధులేగాక గ్రామ పరిధిలోని ప్రభుత్వ సంబంధ పనులన్నీ సర్కారు తమకే చెబుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను బీఎల్వోలుగా, సర్వేయర్లుగా, ఎన్యూమరేటర్లుగా వినియోగించుకుంటూ తమతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నాయని గోడు వెళ్లబోసుకుంటున్నారు.
మొదట అంగన్వాడీ కేంద్రాల్లోనే తమకు తీరికలేనన్ని విధులు ఉన్నాయని, ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఆయాల పనులనూ, టీచర్ల పనులనూ డబుల్ డ్యూటీగా తామే చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలోని విధులైన పిల్లల అంటెండెన్స్; పిల్లలు, తల్లుల ఫేస్ రికిగ్నేషన్, స్టాక్ డీటెయిల్స్; గర్భిణులు, బాలింతల ఫీడింగ్ వంటివన్నీ యాప్‌లో నమోదు చేసేందుకే అధిక సమయం కేటాయించాల్సి వస్తోందని, నెట్వర్క్ సరిగా లేకుంటే తమకు నరకం కన్పిస్తోందని వాపోతున్నారు.
భద్రాద్రి జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు బహుళ విధులతో సతమతమవుతున్నారు. ఆయాలు లేని కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే డబుల్ డ్యూటీలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. గ్రామంలో చీమచిటుక్కుమన్నా అంగన్వాడీ టీచర్‌కే ఫోన్ వెళ్తోంది. అక్కడి నుంచి అదనపు పనులు మొదలవుతున్నాయి. ఇక కొత్తగా వచ్చిన యాప్ ఒక్కోసారి సతాయిస్తుండడంతో దానిలో వివరాలు అప్లోడ్ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో 2,061 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో 192 టీచర్ పోస్టులు, 1,031 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎక్కువమంది టీచర్లు తమ కేంద్రంలోని పిల్లలకు ఆటపాటలు నేర్పుతూనే అన్నం వండి పెట్టాల్సి వస్తోంది. ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం.. రెండేళ్లుగా సాగదీస్తూనే ఉంది.
పిల్లల సంరక్షణ చూడడం, వాటికి విద్యాబోధన చేయడం, వారికి వండి పెట్టడం వంటివి ఒక ఎత్తయితే.. రెండు యాప్‌లలో వివరాలను నమోదు చేయడం మరో ఎత్తు. పోషణ్ ట్రాకర్, ఎన్‌హెచ్‌టీఎస్ అనే రెండు యాప్‌లలో పిల్లల అటెండెన్స్‌ను ఫొటో క్యాప్చర్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియకే ఎక్కువ సమయం పడుతోంది. ఇక ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల్లోపు పిల్లలకు ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఫొటో క్యాప్చర్ తప్పనిసరి. అయితే, వీటిని యాప్‌లో అప్లోడ్ చేసే సమయంలో నెట్వర్క్ లేక సర్వర్ పనిచేయకపోతే.. క్యాప్చర్ నమోదు కాక, ఫీడింగ్ ఇవ్వలేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఇక మారుమూల ప్రాంతాల్లో ఇళ్లకెళ్లి బాలింతలకు ఫీడింగ్ ఇచ్చే సమయంలోనూ నెట్వర్క్ సమస్య వేధిస్తోంది. కిశోర బాలికలకు చిక్కీలు (పల్లీపట్టీలు) అందించే సమయంలోనూ ఇదే సమస్య వేధిస్తోంది.
అంగన్వాడీ టీచర్ల విధి నిర్వహణ అంతా ప్రతి రోజూ ఉరుకులు పరుగులతోనే సరిపోతోంది. తెల్లవారగానే ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటుండగానే అంగన్వాడీని తెరిచే సమయం ఆసన్నమవుతుంది. ఆగమేఘాల మీద అంగన్వాడీ కేంద్రానికి చేరుకోవాలి. వెంటనే పోన్ ఆన్‌చేసి అటెండెన్స్ కొట్టాలి. లేకపోతే సూపర్వైజర్ దగ్గర నుంచి ఫోన్ రానే వస్తుంది. తర్వాత పిల్లలందరూ వచ్చారో లేదో చూసుకోవాలి. లేకపోతే తల్లులకు ఫోన్ చేసి పిల్లలను పంపమని చెప్పాలి. పిల్లలు వచ్చాక వాళ్లని కూర్చోబెట్టి ఆటపాటలు నేర్పించాలి. ఆ తరువాత పూర్వ ప్రాథమిక విద్యనూ బోధించాలి. ఆయా లేని అంగన్వాడీ కేంద్రాల టీచర్లయితే ఇటు పిల్లలను ఆడిస్తూనే వారికి వంట చేయాలి. ఈలోపు ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వస్తే వారికి సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎంతమంది పిల్లలు హాజరయ్యారో, ఎంతమంది తల్లుల ఇంటికి వెళ్లి ఫీడింగ్ పంపిణీ చేశారో, అంగన్వాడీ కేంద్రంలో ఇంకా నిల్వలు ఎన్ని ఉన్నాయో వంటి వివరాలను ఉన్నతాధికారులకు ఫోన్లలో తెలియజేయాలి.
మా అంగన్వాడీ కేంద్రాన్ని అప్‌గ్రేడ్ చేశారు. కానీ ఆయా పోస్టును భర్తీ చేయలేదు. దీంతో ఆయా పనులు కూడా నేనే చేయాల్సి వస్తోంది. కేంద్రంలోని పిల్లలను చూసుకుంటూనే వారికి వండి పెట్టడం కష్టంగా ఉంటోంది. దీనికితోడు రెండు యాప్‌లలో వివరాలను అప్లోడ్ చేయడం, ఇతర పనులకు వెళ్లడం, ఉన్నతాధికారుల ఫోన్లకు, తనిఖీలకు సమాధానం చెప్పడం వంటివి తలకు మించిన భారంగా ఉన్నాయి.
-పూనెం జ్యోతి, అంగన్వాడీ టీచర్, సుజాతనగర్
భద్రాద్రి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పూర్తి వివరాలను తీసుకుంది. ఇప్పటికే సీడీపీవోలు, సూపర్వైజర్ల నియామకం జరిగింది. త్వరలో గ్రేడ్-2 సూపర్వైజర్లకు కూడా గ్రేడ్-1 సూపర్వైజర్లుగా ప్రమోషన్లు వస్తాయి. ఆ వెంటనే టీచర్లు, ఆయాల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మినీలను అప్‌గ్రేడ్ చేయడంతో ఆయాల పోస్టులు ఖాళీ అయ్యాయి.
-స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూవో