ఖమ్మం రూరల్, జూన్ 15: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో సుమారు 300 కుటుంబాలకు పైగా ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం వరకు ఈ కాలనీలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీల సేవలు పొందేందుకు నాయుడుపేట వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని గమనించిన అప్పటి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి దృష్టికి స్థానికులు సమస్యను తీసుకవెళ్లడంతో అంగన్వాడీ కేంద్రానికి భవనం మంజూరైంది. అనంతరం భవన నిర్మాణం పూర్తి కావడంతో నాయుడుపేట నుంచి ఐసీడీఎస్ అధికారులు కేంద్రాన్ని ఇందిరమ్మ కాలనీకి తరలించారు. అయితే భవన నిర్మాణం పూర్తయిందే తప్ప మౌలిక వసతుల కల్పన, ప్రహరీ నిర్మాణం చేపట్టాలనే అలోచన చేయకపోవడం విశేషం.
అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ సమస్యలతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రహరీ లేకపోవడంతో పిల్లలను కాపాడు కోవడం సిబ్బందికి తలకుమించిన భారం అవుతుంది, ఇది ఇలా ఉండగా.. కేంద్రంలో తాగునీరు, ఇతర నీటి సౌకర్యం అందుబాటులో లేదు, మూత్ర, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది, పిల్లల ఇబ్బందులు, అన్నీ ఇన్నీకావు. ఇప్పటికైనా మండల అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు ప్రమాదపు, అసౌకర్యాల నడుమ సాగుతున్న ఈ కేంద్రానికి అవసరమైన వసతులు కల్పించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.